OpenAI భద్రతను బలోపేతం చేసే మా తదుపరి కార్యాచరణకు సన్నాహాలు
OpenAIలో మా తదుపరి ప్రత్యేక అంతర్గత భద్రతా కార్యాచరణకు సన్నాహాలు చేస్తున్నాం. మా మోడళ్లతో మా వ్యవస్థలను పరీక్షించి, బలోపేతం చేసేందుకు కొత్త పరిశోధకులు, భద్రతా భాగస్వాములను మా బృందాలతో కలిసి పనిచేయడానికి ఆహ్వానిస్తున్నాం. మేము Cathedralతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం. దాని పరిశోధకులు మా బృందాలతో కలిసి OpenAI మోడళ్లను ఉపయోగించి మా రక్షణ వ్యవస్థలను సవాలు చేస్తారు. లోపాలను కనుగొనడంలో తమ ప్రత్యేక నైపుణ్యం, విధానాలతో మా వేదికలను రక్షించడంలో సహాయపడతారు.
అలాగే మా భద్రతా లోపాలను గుర్తించినవారికి బహుమతులు అందించే కార్యక్రమానికి సంబంధించి మేము దాన్ని మెరుగుపరుస్తున్నాము. ఇందులో భాగంగా అత్యంత తీవ్రమైన లోపాలను గుర్తించినందుకు ఇచ్చే బహుమతులను నాలుగు రెట్లకు పైగా పెంచుతున్నాం. పరిశోధకులు మా అంచనాలను ప్రశ్నించాలని, మా వ్యవస్థలతో పాటు వాటిని రక్షించే పద్ధతులను బలోపేతం చేయడంలో సహాయపడాలని కోరుకుంటున్నాం.
మా వ్యవస్థల్లోని లోపాలను నిరంతరం కనుగొని సరిదిద్దేందుకు AIని ఉపయోగిస్తూ మేము చేస్తున్న కృషిలో ఇది భాగం. ఈ విధానంతో ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో మా గత ప్రత్యేక కార్యాచరణ చూపించింది. మా ఉత్పత్తుల ఇంజినీర్లలో 25% మందిని మా వ్యవస్థల్లోని లోపాలను కనుగొని సరిదిద్దే పనికే కేటాయించాం. Codex సహాయంతో ఇంజినీర్లు గుర్తించిన లోపాలను పరిశోధించారు, వేరుగా ఉంచిన పరీక్షా వాతావరణాల్లో భద్రతా లోపాలను పునరుత్పత్తి చేశారు, సమీక్ష కోసం సవరణలను సిద్ధం చేశారు.
సాంప్రదాయ సైబర్ రక్షణ పద్ధతులు మాత్రమే ఇక సరిపోవు కాబట్టి, ఆ కృషిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాం. ముప్పులు ఎంత త్వరగా తలెత్తగలవో పరిశ్రమవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఘటనలు చూపిస్తున్నాయి. దాడిచేసేవారి కంటే ముందే లోపాలను కనుగొని సరిదిద్దేందుకు నిరంతరం పునరావృతమయ్యే రక్షణ ప్రక్రియలను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో కూడా అవి స్పష్టం చేస్తున్నాయి.
రక్షకులకు ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం కొనసాగాలంటే, సంస్థలు అత్యాధునిక సైబర్ సామర్థ్యాలతో తమ వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవాలి. మా సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి మా అత్యంత సామర్థ్యవంతమైన మోడళ్లను ఉపయోగిస్తున్నాం. వాటిని Daybreak వినియోగదారులకూ అందుబాటులోకి తెస్తున్నాం. అత్యవసర సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడంలో ముందుండే రక్షకులకు ఆరు నెలల పాటు రాయితీపై వినియోగ అవకాశం కల్పించేందుకు 100 కోట్ల డాలర్లు కేటాయిస్తామని కట్టుబడి ఉన్నాం. పరిశ్రమలు, ప్రభుత్వంలో సైబర్ రక్షకులను మరింత సమర్థులుగా తీర్చిదిద్దేందుకు మా ప్రణాళికను పంచుకుంటున్నాం. దానితో పాటు గత ప్రత్యేక కార్యాచరణలో ఉపయోగించిన వ్యవస్థ నిర్మాణాన్ని, నేర్చుకున్న పాఠాలను కూడా పంచుకుంటున్నాం.
మా మోడళ్లను మరింత మెరుగుపరుస్తూ, వాటితో మా సొంత వ్యవస్థలను బలోపేతం చేస్తూ, మరింత మంది విశ్వసనీయ రక్షకులకు వాటిని అందుబాటులోకి తెస్తూనే ఉంటాం. రక్షకులకు ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం కొనసాగాలంటే పరిశ్రమ అంతటా చర్యలు అవసరం. ఆ పని ఇప్పుడే మొదలవ్వాలి.


